ఆ భూముల్లో సాగు చేయరు.. పంటలు పండవు.. వాటికి రైతులు యజమానులు కారు! కానీ ప్రతి ఏటా ఆ భూములకు మాత్రం రైతుబంధు పథకం అమలవుతున్నది. ఇలా వందెకరాలో, వేయి ఎకరాలో కాదు.. ఏకంగా 20 లక్షల ఎకరాలపై చిలుకు వ్యవసాయేతర భూములకు రైతుబంధు కింద ప్రతి ఏటా రూ.3 వేల కోట్ల సొమ్ము జమవుతున్నదని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాము క్రాప్ బుకింగ్ చేయడం లేదని, రెవెన్యూ శాఖ ఇచ్చే పట్టాదార్ పాస్ పుస్తకాల ఆధారంగానే రైతుబంధు ఇస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు ధరణి కమిటీకి తెలిపారని సమాచారం. అనేకచోట్ల ఇండ్లు, ప్లాట్లు, రోడ్లు, కాలువలు, గుట్టలు, పడావు భూములకు పట్టాలున్నాయి. వీటిని పరిశీలించకుండా రైతుబంధు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 2018 నుంచి 2024 జనవరి 26వ తేదీ వరకు రైతుబంధు కింద రైతులకు రూ.76,191 కోట్లు ఇచ్చారు. ఇందులో ఏటా రూ.3 వేల చొప్పున 5 ఏళ్లుగా దాదాపు 15 వేల కోట్ల వరకు వ్యవసాయేతర భూములకు రైతుబంధు డబ్బులు వెళ్లాయని చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో మొత్తం భూములు 2,76,95,571 ఎకరాలు. ఇందులో పట్టణాలు, గ్రామాలలో కలిపి ఇండ్లు, ప్లాట్ల కింద 9 లక్షల ఎకరాలు, పరిశ్రమల కింద 2 లక్షల ఎకరాలు, అటవీ భూములుగా 64 లక్షల ఎకరాలు, చెరువులు, రిజర్వాయర్లు 17.5 లక్షల ఎకరాలు, నిరుపయోగమైన భూములు 15 లక్షల ఎకరాలు ఉన్నాయని ఒక అంచనా. అయితే వ్యవసాయ భూములు మాత్రం 1.52 కోట్ల ఎకరాలున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెపుతున్నది. కోటిన్నర వ్యవసాయ భూములుగా గత ప్రభుత్వం చెపుతున్న లెక్కల్లో వాస్తవంగా సాగు అవుతున్నది ఎన్ని ఎకరాలో ఎక్కడా స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వాలు ప్రతి ఏటా సాగు ఎన్యూమరేషన్ చేయాలి. వానకాలం, యాసంగి సీజన్లలో రైతులు పంటలు ఏమేం పండించారు? ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఇలా పంటలవారీగా, సర్వే నంబర్లవారీగా, భూ యజమానులవారీగా లెక్కలు తీసి, రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు సాగు చేశారో వెల్లడించేవారు. కానీ గత బీఆరెస్ ప్రభుత్వం రైతుబంధు స్కీమ్ మొదలు పెట్టిన ఏడాది నుంచి అనూహ్యంగా పంటల లెక్కలు ఎన్యూమరేట్ చేయడాన్ని వదిలేసిందనే మాట వినిపిస్తున్నది. ఈ స్కీమ్ మొదలు పెట్టిన ఏడాది.. గ్రామం మొత్తం ఒక యూనిట్‌గా తీసుకొని అంచనాలు వేశారని, ఆ తరువాత ఏడాది ఒకరిద్దరు రైతులను అడిగి లెక్కలు వేశారని, మరోసారి సర్వే నంబర్ వారీగా వేశారని తెలుస్తున్నది. అదికూడా సరిగ్గా పరిశీలన చేయకుండా రైతులను అడిగి లెక్కలు రాసుకున్నట్లు సమాచారం. అయితే ఏ విధంగా సాగు లెక్కలు తీస్తున్నారని ధరణి కమిటీ సభ్యులు అడిగితే రెవెన్యూ శాఖ ఇచ్చే భూ యజమానుల లెక్కల ఆధారంగానే రైతుబంధు వేస్తున్నామని చెప్పడం గమనార్హం. పంటల వివరాలు తీయడం కోసం 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమించామని గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్నది. కానీ ఈ వ్యవసాయ అధికారులు ఏ లెక్కలు తీశారు? ఏ పంటలు వేయమని సలహాలు ఇచ్చారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పంట లెక్కలు తీయని సర్కారు.. ఎవరు ఏ భూమిని సాగు చేస్తున్నారనే లెక్కలు కూడా లేకుండా చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖకు గ్రామస్థాయిలోని రెవెన్యూ అధికారులు ప్రతి ఏటా పహాణీ రాసేవారు. ఇందులో భూ యజమాని ఎవరు? ఆ భూమి ఎవరు కాస్తు చేస్తున్నారనే లెక్కలు ఉండేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం ధరణి చట్టం తీసుకొచ్చి, కాస్తు కాలం ఎత్తి వేసింది. గ్రామస్థాయిలో పని చేసే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. దీంతో గ్రామస్థాయిలో భూముల పర్యవేక్షణ లేకుండా పోయింది. ఫలితంగా ఏ రైతు ఏ భూమిని సాగు చేస్తున్నారో తెలియజేసే లెక్కలే లేవు. పాస్ పుస్తకంలో ఎన్ని ఎకరాల భూమి ఉంటే అంతవరకు సాగు అవుతున్న భూమి కింద లెక్క గట్టి రైతుబంధు ఇస్తున్నారు.
సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సరిహద్దుల్లోని ఇబ్రహీంపూర్, బిల్కల్ రెవెన్యూ గ్రామాలకు చెందిన 65 ఎకరాల భూమిలో అపెక్స్ రిసార్ట్స్ పేరుతో లే అవుట్ వేసుకొని, ఇండ్లు కట్టుకొని అక్కడ ప్రజలు నివసిస్తున్నారు. ఈ భూమిని విక్రయించినవారికి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చిన సర్కారు.. ప్రతి ఏటా రైతుబంధు ఇస్తోంది. దీనిపై అపెక్స్ రిసార్ట్స్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ప్లాట్ ఓనర్స్ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై న్యాయస్థానం గత ఏడాది ప్రభుత్వంపై సీరియస్ అయింది కూడా. మరోవైపు రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో 200 ఎకరాల హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి భూములకు కూడా రైతుబంధు ఇస్తున్న విషయం ఇటీవల వెలుగు చూసింది.