రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టర్లు, బ్యానర్ల, యాడ్ లతో తో హవా చేసి.. పుంగనూరు కేంద్రంగా పోటీ చేస్తున్న బీసీవైకే అధినేత రామచంద్ర యాదవ్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా? సొంత సామాజిక వర్గంలోనే ఆయనకు వ్యతిరేకత ఎదురవుతోందా? నిన్నటి వరకు పుంగనూరు లో ఎదురే లేదన్న ఆయనకు వ్యతిరేకంగా.. పోటీగా.. డాక్టర్ మురళీ మోహన్ యాదవ్ పోటీ కి సై అనడమే ఇందుకు నిదర్శనమని ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి మురళీ మోహన్ యాదవ్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు యాదవ సామాజికవర్గం వెన్నుదన్నుతోనే విద్యాధికుడైన మురళీ యాదవ్ పుంగనూరు పోటీకి బరిలో నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
సమాజ్ వాదీ పార్టీ నేతగా 12 ఏళ్ల పాటు పనిచేసి యాదవ సమాజంలో కీలకంగా వున్న మురళీ మోహన్ యాదవ్ పుంగనూరు నుంచి పోటీ ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ ఏపీ ఓబీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతల సాన్నిహిత్యంతోనే ఆయన పార్టీలో చేరగానే కీలకమైన ఓబీసీ వర్కింగ్ ప్రసిడెంట్ దక్కిందని కాంగ్రెస్ లోని వర్గాలు చెవులు కొరుక్కొంటున్నాయి. ఇప్పుడిక పుంగనూరుపై మురళీ యాదవ్ కన్నేయడం పలు అంచనాలకు ఆస్కారం ఇస్తోంది. ఢిల్లీ యాదవ సంఘం నేతలతో అత్యంత సాన్నిహిత్యం మెలిగే ఆయన దశాబ్దకాలానికి పైబడి పరిచయాలు వున్నాయి. ఇవే కాంగ్రెస్ లో ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. దీంతోనే యూపీ, హర్యానా కాంగ్రెస్ నేతల మద్దతుతో పుంగనూరు బరిలో నిలిచేందుకు ఆయనకు మార్గం సుగమమైంది.
విద్యార్థి దశ నుంచే మురళీ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎస్వీయూ క్యాంపస్ కేంద్రంగా పనియడ వల్ల అన్ని పార్టీల నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు వుండటం ప్లస్ గా మారింది. ఇప్పటికే ఎస్వీయూ అధ్యాపక, విద్యార్థి, యువజన సంఘాలు మురళీ మోహన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. విద్యార్థి దశ అనంతరం వ్యాపార రంగంలోకి వచ్చిన ఆయన పలు కళాశాలలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి, న్యూఢిలీలోని కీలక బీసీ నేతలు ఆర్థికంగా మురళీ యాదవ్ కు ఎంతైనా సహకరించే లా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పుంగనూరు లో కాంగ్రెస్ కు గత వైభవాన్ని తీసుకురావాలనే వుద్దేశంతో పీసీసీసీ కూడా వున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ లోని ఒక కీలక నేత స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో పుంగనూరులో ఇప్పటికే యాదవ, బీసీ ఓట్లు గుంపగుత్తగా తనకే పడతాయన్ని అనుకుంటున్న బీసీవైకే అధినేతకు ఓట్ల చీలక తప్పదని అంటున్నారు. మురళీ యాదవ్ సర్వే
ద్వారా తన పరిస్థితి అంచనా వేసుకున్నాకే .. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆశీస్సులతో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో బీసీ, యాదవ ఓట్లు మురళీ యాదవ్, రామచంద్ర యాదవ్ చీల్చడం వల్ల పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి లాభిస్తుందా లేదా టిడిపి అభ్యర్థికి లాభిస్తుందా అన్న దానిపై చర్చ నడుస్తోంది.