ఒకవైపు సోమాలియా పైరేట్లు, మరో వైపు హౌతీ దళాల దాడులతో ఉద్రిక్తంగా మారిన సముద్రాన్ని.. ఇండియన్ నేవీ ఎల్లవేళలా వేయి కళ్లతో నిఘా కాస్తోంది.ఒకవైపు సోమాలియా పైరేట్లు (Somalia pirates) , మరో వైపు హౌతీ దళాల దాడులతో ఉద్రిక్తంగా మారిన సముద్రాన్ని.. ఇండియన్ నేవీ ఎల్లవేళలా వేయి కళ్లతో నిఘా కాస్తోంది. ఏ వాణిజ్య నౌక అయినా ఎమర్జెన్సీ సమాచారం ఇవ్వగానే గంటల వ్యవధిలోనే అక్కడకు చేరుకుని సముద్రపు దొంగల ఆటలు కట్టించి అవి ప్రమాదం నుంచి బయట పడేంత వరకు రక్షణగా ఎస్కార్ట్‌గా వెళుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో రెండు ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించి సిబ్బంది ప్రాణాలు కాపాడింది. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల బారిన పడిన నౌకను ఇండియన్ నేవీ రక్షించింది. ఘటనా స్థలానికి ఐఎన్ఎస్ సుమిత్ర.. 11 మంది పైరేట్ల నుంచి 19 మంది పాకిస్థాన్ జాతీయులైన నౌకా సిబ్బందిని రక్షించింది. అంతకు ముందు ఆదివారం.. ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకనూ దొంగలు హైజాక్ చేయగా.. ఆ నౌకనూ విడిపించింది.
అయితే వీటన్నింటి వెనుక ఉన్న ఒక శక్తి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కరడుగట్టిన సోమాలియా పైరేట్ల నుంచి సిబ్బందిని ప్రాణాలతో రక్షించడం అంత తేలిక కాదు. అగ్రరాజ్యాలు కూడా వీరితో పెట్టుకోవడానికి కాస్త వెనకా ముందు ఆలోచిస్తాయి. అలాంటి పనిని అవలీలగా నేర్పుగా చేసే భారత నేవీలోని ఒక విభాగం పేరు మార్కోస్ (MARCOS) . మెరైన్ కమాండోస్‌కి సంక్షిప్త రూపమే మార్కోస్. కేవలం సముద్రపు దొంగలు, నౌకలకు వచ్చే వివిధ రకాల హెచ్చరికలు, బెదిరింపుల నుంచి వాటిని కాపడటమే వీరి ప్రధాన విధి. కేవలం భారత ప్రాదేశిక జలాల్లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా ఆపరేషన్స్ నిర్వహించేలా వీరికి కఠిన శిక్షణను ఇస్తారు. వారి గురించి భద్రతా నిపుణులు పంచుకున్న అరుదైన విశేషాలివి… మార్కోస్ దళాలు.. భారత్‌లోని అత్యంత ప్రధానమైన భద్రతా విభాగాల్లో ఒకటి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, గరుడ, పారా కమాండోస్, ఫోర్స్ ఒన్ వంటి సుశిక్షిత దళాల సరసన మార్కోస్ ఉంటుంది.
మార్కోస్లోని సైనికులకు అత్యంత కఠినమైన శిక్షణను ఇస్తారు. ఏమాత్రం ముందస్తు ఏర్పాట్లు లేకుండా సముద్రంలోకి దిగడం, నీటిలోనే ఆయుధాలను ఆపరేట్ చేయడం వంటి వాటిల్లో వీరు ఆరితేరి ఉంటారు. ఒక విధంగా యూఎస్ సీల్స్ విభాగానికి.. భారత్‌లో ప్రతిరూపమే మార్కోస్. సాధారణ సైన్యానికి అసాధారణ పరిస్థితులు అడ్డుగా ఉంటాయేమో కానీ వీరికి అసాధారణ అననుకూల పరిస్థితులంటూ ఉండవు. మంచు, ఎడారి, వాన, ఎండ, చలి, ఉక్కపోత ఇలా ఏ వాతావరణంలోనైనా వీరు సర్దుకుపోయి ఆపరేషన్‌లో పాల్గొంటారు.కేవలం నీటిలోనే కాకుండా వాయు, భూ తలాలపైనా అవసరాన్ని బట్టి ఈ దళాలు విధులు నిర్వర్తిస్తాయి. వీరికి మరోపేరు ఫియర్లెస్.. దానికి తగినట్టే వీరి యుద్ధ నినాదం కూడా ద ఫ్యూ ద ఫియర్లెస్ అని ఉంటుంది. అంటే భయం లేని అతి కొద్ది మంది అని అర్థం. 1987లో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. ముంబయి దాడుల తర్వాత.. సముద్ర తీర ప్రాంత రక్షణలో వీరి పాత్ర కీలకంగా మారింది.