తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందంటూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని గొప్పగా ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమిపాలైంది. దీనిపై అంతర్మథనం చెందుతున్న గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్సీల భేటీలో వెల్లడించడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నారని కేటీఆర్ వెల్లడించారు. అంటే తుంటి ఆపరేషన్ నుంచి ఒకవైపు తాను కోలుకునే ప్రయత్నాలు చేస్తూనే ఇంకోవైపు పార్టీని తిరిగి బలోపేతం చేసి, రానున్న లోక్‌సభ సహా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సన్నద్ధం చేసే దిశగా కేసీఆర్ మేధోమథనం చేస్తున్నారని కేటీఆర్ మాటల్లోనే అవగతమవుతున్నది. అంతేగాక ఇటీవల లోక్‌సభ సన్నాహక సమావేశాల్లో ఇక నుంచి బీఆరెస్‌లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీ కాకుండా పార్టీ కేంద్రంగానే ఎమ్మెల్యేలు పనిచేసే విధానం తీసుకొస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీఆరెస్‌లో సంస్థాగతంగా భారీ మార్పులకు కేసీఆర్ సిద్ధపడుతున్నారని గులాబీ పార్టీలో చర్చ సాగుతున్నది. అయితే అధినేత కేసీఆర్ మొదలుకుని వ్యక్తి పూజ మయమై, ఎమ్మెల్యేలు కేంద్రంగా సాగిన బీఆరెస్ పార్టీలో సంస్థాగత మార్పులు ఒక్కసారిగా జరిగే పనేనా అన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తున్నది.అధికారంలో ఉన్నన్నినాళ్లు పార్టీ నిర్మాణంపై అధినేత కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పెద్దగా దృష్టి సారించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. పాలనపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం వల్ల పార్టీకి సమయం ఇవ్వలేక పోయామని కేటీఆర్ సైతం లోక్‌సభ సన్నాహక సమావేశాల్లో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి అయినా కీలకమైన సంస్థాగత నిర్మాణంపై ఓటమి తర్వాతనైనా బీఆరెస్ నాయకత్వం దృష్టి సారించడం కీలకమైన దిద్దుబాటు చర్యే అవుతుందని, ప్రత్యేకించి గ్రామస్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకూ ప్రక్షాళన చేయడం ఆ పార్టీకి కొత్త జవసత్వాలు అందిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆరెస్‌కు జిల్లాల పార్టీ అధ్యక్షులు, మండల, గ్రామశాఖల అధ్యక్షులున్నా నామమాత్రమేననే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లోనే ఉన్నాయి.
కార్యవర్గాల ఏర్పాటు కాగితాలకే తప్ప కార్యవర్గాల సమావేశాలు నిర్వహించే సంస్కృతి ఏనాడో మరిచిపోయారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా వ్యవహరించడంతో వారిదే రాజ్యమన్నట్టు సాగిందని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. దీంతో క్యాడర్‌కు, లీడర్‌కు దూరం పెరిగిపోయిందని అంటున్నారు. కార్యకర్తల కష్టాలు ఏమిటో తెలియకుండా పార్టీ వ్యవహారాలు నడిచాయని చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్‌ను కలువడం కంటే బీఆరెస్‌లో ఎమ్మెల్యేలను కార్యకర్తలు కలవడం అంతకంటే ఎక్కువ కష్టామన్న భావన కార్యకర్తల్లో వినిపించడం అప్పట్లో సర్వసాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులు కేసీఆర్, కేటీఆర్‌లను కలవడం కలలో మాటగానే మారింది. దీంతో సిటింగ్‌లపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్న సంగతి క్యాడర్ ద్వారా అధిష్ఠానానికి చేరలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదీగాక జనం ఓట్లేసేది ఎమ్మెల్యే అభ్యర్థులను చూసి కాదు.. కేసీఆర్‌ను చూసే.. అనే అతి విశ్వాసం సిటింగ్లనే మళ్లీ బరిలోకి దింపేలా చేసిందని, అప్పటికే బీఆరెస్ పాలన, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏకపక్ష పోకడలకు మళ్లీ సిటింగ్‌లే నిలబడటం జనం మెచ్చలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం కార్యకర్తల ద్వారా పైస్థాయి నాయకత్వానికి, తద్వారా అధిష్ఠానానికి తెలియకుండా పోయిందని చెబుతున్నారు.ఎన్నికలకు ముందు మండలాలు, నియోజకవర్గాలవారీగా పార్టీ కార్యకర్తలతో భారీగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సమావేశాలు మేళాలను తలపించాయి. సమావేశాలకు పార్టీ సంస్థాగత సైద్ధాంతిక వాదానికి కట్టుబడే నిజమైన కార్యకర్తలు కాకుండా గ్రామాల నుంచి బహిరంగ సభలకు జనసమీకరణ చేసినట్లుగా సాధారణ జనాన్ని కూడా తరలించేసి తమ సమావేశాలు విజయవంతమైనట్లుగా భావించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమ్మేళనాల్లోనైనా పార్టీ క్యాడర్ అభిప్రాయాలు విన్నారా అంటే అదీ లేదని, కేవలం ఎమ్మెల్యేలు, ఇన్చార్జీల ఉపన్యాసాలు విని వెళ్లిపోతే చాలనే విధంగా అవి సాగాయని గుర్తు చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల తర్వాత ఇప్పుడు తెలంగాణ భవన్ వేదికగా లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు సైతం అదే రీతిలో కేటీఆర్, హరీశ్‌రావు సహా రాష్ట్ర నేతల ఉపన్యాసాల వేదికలుగా మారిపోయాయని పరిశీలకులు అంటున్నారు. కార్యకర్తలు, గ్రామ, మండల నాయకుల అభిప్రాయాలు చాటే అవకాశం వీటిలో కనిపించడం లేదని చెబుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ అధిష్ఠానానికి చేరడం ఇప్పటికీ లేకుండా పోయిందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని ఎలా పునర్వ్యవస్థీకరిస్తారు? మార్పులు, చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.