కో ఆర్డినేట్స్ ఇవ్వడంలో అచ్చు తప్పు… ఫలితంగా శాస్త్రవేత్తలకు చిక్కిన ఖగోళ వింత సుదూర విశ్వం (Space) లో ఉన్న ఓ భారీ గెలాక్సీ (Galaxy) అంతరిక్ష నియమాలనే వెక్కిరిస్తున్నట్లు శాస్త్రవేత్తలకు కనిపిస్తోంది. భూమికి 270 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న జేఓ613+52 అనే ఈ గెలాక్సీ… అసలు గెలాక్సీకి ఉండవలసిన ప్రాథమిక నియమాన్ని పాటించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను తోసిరాజేస్తూ.. ఈ గెలాక్సీలో అసలు నక్షత్రాలే లేవు. పోనీ మరో రకంగా చెప్పాలంటే అవి మనకు కనపడటం లేదు. ఇది తప్ప ఒక గెలాక్సీకి ఉండాల్సిన లక్షణాలన్నీ జేఓ613+52లో ఉన్నాయి. ఇక్కడ నక్షత్రాల స్థానంలో ఇంటర్ స్టెల్లార్ గ్యాస్ ఆ స్థానాన్ని ఆక్రమించింది.
గ్రీన్ బ్యాంక్ అబ్జర్వేటరీ (Green Bank Observatory) కి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ కరెన్ ఓ నీల్ నేతృత్వంలో ఈ అధ్యయనాన్ని (Study) నిర్వహించారు. ఆ వివరాల ప్రకారం.. ఇటువంటి గెలాక్సీలను ప్రైమోర్డియల్ గెలాక్సీలని పిలుస్తారు. ఇటువంటి గెలాక్సీలు ఉంటాయని ఇప్పటి వరకు సిద్ధాంతపరంగా అనుకోవడమే కానీ.. మనం గమనించేంత దగ్గరలోనే ఒక ప్రైమోర్డియల్ గెలాక్సీ ఉందని శాస్త్రవేత్తలు ఊహించలేదు. ఈ తరహా గెలాక్సీలు ఎక్కువగా వాయువులతోనే నిండిపోయి ఉంటాయి. ఈ విశ్వంలో సమయం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే ఈ వాయువులు ఏర్పడి ఉంటాయని శాస్త్రవేత్తల ఊహ.
ఇంత అరుదైన వస్తువును పరిశోధకులు అనుకోకుండానే గుర్తించడం మరో విశేషం. ఇంకా చెప్పాలంటే సిబ్బంది చిన్న పొరపాటు చేయడం మూలాన జేఓ63+52 గెలాక్సీ శాస్త్రవేత్తల కంట పడింది. గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్‌ను సరైన కో ఆర్డినేట్స్ ఇవ్వడంలో జరిగిన అచ్చు తప్పు వల్ల అది నిర్ణీత దిశకు కాకుండా వేరే దిశను పరిశీలిస్తూ పరిశోధన చేసి వివరాలను అందించింది. ఆ అధ్యయనంలో భాగంగానే జేఓ6131+52 గురించి తెలుసుకున్నట్లు ఇటీవల జరిగిన అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ సమావేశంలో ఓ నీల్ వెల్లడించారు. ‘ఇది వాయువులతో నిండిపోయిన గెలాక్సీ. మన పాలపుంత లోంచి నక్షత్రాలను తీసేస్తే ఎలా ఉంటుందో జేఓ631+52 అలా ఉంటుంది. అక్కడ అసలు నక్షత్రాలైనా లేకపోయి ఉండాలి. లేదంటే మనకు కనిపించని చిన్న పరిమాణంలో అయినా ఉండాలి. ఏదైనా అద్భుతమే’ అని అన్నారు. గ్రీన్ బ్యాంక్ అబ్జర్వేటరీ సంస్థ ఎక్కువగా లో సర్ఫేస్ బ్రైట్నెస్ గెలాక్సీల గురించి పరిశోధనలు చేస్తుంది.