పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. త్వరలో రానున్న ఎన్నికల్లో ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు గురిపెట్టారు. ఈక్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై దూషణల పర్వానికి తెరలేపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మాటలతో డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట, కొడంగల్, జడ్చర్ల, షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు లేకపోయినా పార్లమెంట్ స్థానంలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నియోజకవర్గంపై ఎక్కువగా బీజేపీ ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలవక పోయినా, రానున్న లోక్ సభ ఎన్నికల్లో మోడీ పేరుతో గెలుస్తామనే ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ కు బీజేపీ పోటీ వస్తుందనే ఉద్దేశంతో.. కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.
గతంలో చేసిన తప్పులను ప్రస్తుతం ఎత్తి చూపే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. ముఖ్యంగా ఈ మధ్య సీడబ్ల్యుసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణపై చేసిన ఆరోపణలు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయకుంటే రూ.15 కోట్లు ఇవ్వాలని అరుణ తనను డిమాండ్ చేసిందని వంశీచంద్ రెడ్డి ప్రధాన ఆరోపణ. ఇది నిజం కాకుంటే రామాలయంలో ప్రమాణం చేద్దామని అరుణకు సవాల్ చేశారు. ఇందుకు వంశీ తేదీ నిర్ణయిoచి, ఆరోజు శ్రీనివాస కాలనీలోని ఆలయానికి చేరుకొని అరుణ కోసం నిరీక్షించారు. వంశీ సవాల్ స్వీకరించని ఆమె.. ఆలయానికి రాకపోవడంతో వంశీ చేసిన ఆరోపణలు నిజమే అని కాంగ్రెస్ నేతలు అరుణపై విమర్శలు చేశారు.
డబ్బులు అడగలేదని ప్రమాణం చేయడానికి ఆమెకు భయం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. డీకే అరుణ అవినీతి చిట్టా ఇంకా చాలా ఉందని, జిల్లాలో ఆమె చేసిన అవినీతి బాగోతం అంతా బయట పెడతానని వంశీ ఘాటైనా విమర్శలు చేశారు. వంశీ విమర్శలను డీకే అరుణ కొట్టి పారేశారు. ఎవరో గొట్టంగాడు చేసిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదని ఆమె అంటున్నారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలుపు కోసం వంశీ చంద్ రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఆలయంలో ప్రమాణం చేయాలని తనను అనడం చూస్తే వంశీ దివాళాతనం బయట పడిందని అరుణ మండిపడ్డారు. ఈ సెగ్మెంట్ లో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ కు ఓటమి తప్పదని దృష్టిలో పెట్టుకున్న వంశీ ఇలా తప్పుడు ఆరోపణలు చేసి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని అరుణ ఆగ్రహం చెందారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా, దుమ్మెత్తి పోసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరని ఆమె పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ అవినీతిపరులని, జడ్చర్ల నియోజకవర్గంలో దేవాలయ భూములు ఆక్రమించేందుకు విశ్వప్రయత్నం చేశారని, ఆయనకు అప్పటి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి సహకారం అందించారని ఆరోపణలు చేశారు. ఆలయ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నం ఇప్పుడు చేసి ఉంటే ఇద్దరూ అన్నదమ్ములను పెట్రోల్ పోసి తగులబెట్టే వారమని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ అంటే అందరూ భయపడ్డారని, మాలాంటి వారు ఉంటే ఆయనను అడ్డుకుని జిల్లా నుంచి తరిమి వేసేవారమ్మన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆయనకు తొత్తులుగా మారడంతో శ్రీనివాస్ గౌడ్ మరింత రెచ్చిపోయి తన ఇష్టానుసారంగా వ్యవహరించి జిల్లాలో ఉన్న సంపద కొల్లాగొట్టారని మండిపడ్డారు. పాలమూరు పార్లమెంట్ స్థానంలో శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తేనే మజా ఉంటుందని, ఆయనకు దమ్మూధైర్యం ఉంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని అనిరుద్ సవాల్ చేశారు.
ఒకప్పుడు చిన్నమాటకే అగ్గిమీద గుగ్గిలం అయ్యే శ్రీనివాస్ గౌడ్.. ప్రస్తుతం ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగా ఉంటున్నారు. అనిరుద్ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా, సవాల్ చేసినా శ్రీనివాస్ గౌడ్ స్వీకరించలేకపోతున్నారు. ఓటమి తరువాత కోరలు పీకేసిన పాములా మారాడని శ్రీనివాస్ గౌడ్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పాలమూరు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్ పదవిని అవిశ్వాసం పెట్టి గద్దె దించడంలో ఎన్నం సఫలీకృతుడయ్యారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ కు చెక్ పెట్టినట్లు అయింది.