సిరిసిల్ల బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తారక రామారావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గు మంటున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ స్పోక్స్ పర్సన్ కటకం మృత్యుంజయం, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే ఆ పార్టీ నేతలకు తెలంగాణ ప్రజల నుండి పేగు బంధం తెగిపోయింది అన్నారు.
అధికారం కోల్పోయినా, కేటీఆర్ కు అహంకారం తగ్గలేదని, మళ్లీ ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన తారక రామారావుకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు వెలగబెట్టిన ఆయన ఏలుబడిలో సిరిసిల్ల పురపాలక సంఘం కనీసం కరెంటు బిల్లులు కట్టలేని దుస్థితికి చేరుకుందన్నారు. సిరిసిల్ల నేతకార్మికులకు 400 కోట్ల బకాయిలు పెట్టిన అసమర్ధుడికి తమ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోకపోతే ఆయన ఒకటి మాట్లాడితే తాము రెండు మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా తారక రామారావుకు ఇంకా బుద్ధి రాలేదన్నారు.ఆయన ఇంకా తాము అధికారంలో ఉన్నామనే భ్రమలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబుకాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి విషయంలో ఎవరు ఎలాంటి అపోహ పెట్టుకోవద్దని, జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగిపోదని స్పష్టం చేశారు.
నేతన్నలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. సిరిసిల్ల నేతన్నల కోసం ప్రవేశపెట్టిన వర్క్ టు ఓనర్ పథకం 10 ఏళ్లలో ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికలు వస్తుండడంతో, కేవలం వారి ఓట్ల కోసం కొత్త డ్రామాలు మొదలు పెట్టారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు తిరిగి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కరీంనగర్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటిర్ చేసిన వ్యాఖ్యలు ఆయన దొర అహంకారానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. శాసన సభ్యులుగా బీసీలు, ఎస్సీలు ఎన్నిక కావడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడనీ.. వారి పట్ల అవహేళనగా మాట్లాడడం కేటీఆర్ దుర అహంకారానికి.. దొర అహంకారానికి పరాకాష్ట అని తెలిపారు. కేటీఆర్ ఇంకా అధికార మత్తులోనే ఉన్నాడని… ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు.
హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలతో సహా తనపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని.. ఎస్సీ, బీసీ సమాజానికి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో మీ తండ్రికి , మీకు జ్యోతిరావు పూలే వంటి మహనీయులు గుర్తుకు రాలేదా?.. అప్పుడు అసెంబ్లీ ఆవరణలో ఆ మహనీయుని విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ మండి పడ్డారు.